కోణార్క్ సూర్యదేవాలయం

కోణార్క్ సూర్యదేవాలయం, 13వ శతాబ్దానికి చెందిన ఈ సూర్య దేవాలయం ఒడిషారాష్ట్రంలోని పూరీ క్షేత్రానికి ఎనభై ఐదు (85) కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నల్ల గ్రానైటు రాళ్ళతో కట్టిన పదమూడవ శతాబ్దానికి చెందిన సూర్య దేవాలయం ఉంది. దీన్ని తూర్పు గంగా వంశానికి చెందిన నరసింహదేవుడు (1236 – 1264) నిర్మించాడు. ఈ రాజా లాంగులా నరసింహదేవుడు రాజా అనంగభీముని కుమారుడు. సూర్య భక్తుడు. ఈ మందిరము ఎత్తు 230 అడుగులు.
ఈ ఆలయం ప్రపంచ వారసత్వ పరిరక్షిత ప్రదేశం. సూర్యుని రథం ఆకారంలో నిర్మించిన ఈ ఆలయం నగిషీలు చెక్కిన శిల్పాలతో అద్భుతంగా అలంకరించబడి ఉంది. ఈ ఆలయ సముదాయం మొత్తం ఏడు బలమైన అశ్వాలు, 12 జతల అలంకృత చక్రాలతో లాగబడుతున్న పెద్ద రథం ఆకారంలో కట్టబడింది. కోణార్కలో సముద్రతీరమున నిర్మించిన ఈ సూర్య దేవాలయము సూర్య గమనమునకు అనుగుణంగా ఈ ఆలయ నిర్మాణం జరగటం అద్భుతాలలోకెల్లా అద్భుతంగా కనిపిస్తుంది. రధానికిపన్నెండు చక్రాలు, సంవత్సరానికి పన్నెండు మాసాలు, పన్నెండు రాసులు వీటి అనుగుణంగా సూర్యగమనం ఒక్కొక్క చక్రంలో ద్యోతకమౌతుంటుంది.అద్భుతమైన శిల్పకళకు, ఆధునిక పరిజ్ఞానికి గుర్తుగా కోణార్క్ దేవాలయాన్ని పేర్కొనవచ్చు.
ఆలయ విశేషాలు
- ఈ సూర్యదేవాలయములో ఎన్నో విచిత్రాలు ఉన్నాయి.
- ఆలయం రథాకారము కలిగి ఉంటుంది.
- ఆలయాన పన్నెండు జతల చక్రాలు కలిగి ఉంటుంది.
- దేవాలయముపైన పద్మము, కలశము ఆకర్షణీయముగా చెక్కబడి ఉన్నాయి.
- ఖుజరహొ మాదిరి ఇక్కడకూడా శృంగార రసభరిత శిల్పాలు విషేషంగా ఉన్నాయి.
- ఇక్కడి సముద్రతీర ఇసుక బంగారపు వర్ణములో ఉండి తీర ప్రాంతము అందాలు చిందుతూ ఉల్లాసం కలిగిస్తుంది.
- సూర్యుని రథం ఆకారంలో నిర్మించబడిన ఈ దేవాలయానికి ఇరువైపులా పన్నెండు జతల చక్రాలు చెక్కబడి ఉన్నాయి. అలాగే వారంలోని ఏడురోజులను సూచించే విధంగా ఏడుగురర్రాలు చెక్కబడి ఉంటాయి. ఈ చక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా స్థానికులు కచ్చితమైన సమయాన్ని చెప్పగలరు.
సూర్య పరిభ్రమణాన్ని చూపించే విధంగా ఈ చక్రాలు చెక్కబడడం ఓ గొప్ప విశేషం. అలాగే ఈ దేవాలయంపై అనేక శృంగారభరిత శిల్పాలు సైతం చెక్కబడి ఉన్నాయి. కోణార్క్ ఆలయంలో మూల విరాట్టు లేకపోవడం కూడా ఓ చెప్పుకోదగ్గ విషయమే. కోణార్కలో ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమికి{రథసప్తమి} బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ప్రపంచ నలుమూలల నుండి వేలాదిగా తరలి వస్తారు.భక్తులు దేవాలయానికి దగ్గర్లో ఉన్న చంద్రభాగ తీర్థంలో స్నానం చేసి దేవాలయంలో ఉన్న నవగ్రహాలను పూజిస్తారు.
కోణార్క్‌లో సూర్యుని దేవాలయంతో పాటు అఖండాలేశ్వర దేవాలయం, అమరేశ్వర ఆలయం, దుర్గ, గంగేశ్వరీ, కెండూలీ, లక్ష్మీ నారాయణ, మంగళ, నీల మాధవ ఆలయాలు కూడా ఉన్నాయి.
ఈ నిర్మాణమునకు విచిత్రమైన పౌరాణిక కథలు కూడా ఉన్నాయి. దీనినే మైత్రేయవనమని అందురు. ఉత్కళంలో ఇదే పద్మక్షేత్రం. సూర్య భగవానుడికి ఇక్కడనే ఉపాసన జరిగేది. ఒక కథ ప్రకారం శ్రీకృష్ణుని కుమారుడగు సాంబుడు ఒకనాడు నీళ్ళరేవులో అభ్యంగన స్నానం చేస్తున్న స్త్రీలను చూసాడని తండ్రి అతడిని శాపించినాడట. తండ్రి శాపం వల్ల సాంబుడు కుష్టురోగి పీడితుడై ఈ మైత్రేయవనంలో చంద్రభాగా తీరాన సూర్యారాధనచేసి రోగవిముక్తుడయ్యడట. ఆ పవిత్రతను బట్టి సాంబుడు సూర్య ప్రతిమను స్థాపించి ఈమందిరాన్ని కట్టించాడట. మరొక కథ పద్మ పురాణంలో ఉంది. స్వయం సూర్యభగవానుడే ఇచ్చట తపస్సు చేసాడనీ, అందుకే ఈ మందిరానికి పవిత్రత కలిగినదట.
ఒడిషా లోని పుణ్యక్షేత్రాల్లో శంఖక్షేత్రం (పూరి), చక్రక్షేత్రం (భువనేశ్వరం), గదాక్షేత్రం (జాజ్ పూర్), ఈ పద్మక్షేత్రం ప్రసిద్దమైనవి.ఈ క్షేత్రం హిందువులకు అత్యంత పవిత్రంమైనది, ఇచ్చోటనే భక్త కబీరుదాసు సమాధి ఉండెనని అబుల్ఫజల్ యొక్క అయినీ అక్బరీ చెప్పుతోంది. దీనికి నల్ల పగోడా అని కూడా అంటారు.దీనిని యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు.
మందిర వర్ణన
ఈ దేవాలయం, మొగసాల (An entrance hall) రెండూనూ పీఠంపైన రథం లాగా చెక్కిఉంది. పీఠంలో 24 చక్రాలు, ఒక్కొక్కచక్రం చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. మొగసాల సమ్ముఖంలో ఏడుగుర్రాలు. శాస్త్రోక్తంగా సూర్యభగవానుడు సప్తాశ్వరధారూఢుడై ప్రపంచం చుట్టూ తిరుగుతున్నాడు. అవన్ని ఇప్పుడు అంతగా లేవు. ఒరిసా దేవాలయములు నాలుగురకాలు: రేఖ, భద్ర, ఖఖారా, గౌరీయ. ఈదేవాలయమును, పూరి భువనేశ్వరాలయాలును రేఖా దేవాలయములు. కోణార్కము ఐదు రథాలమందిరము. మందిరం మధ్యభాగములో సుచారుకారు ఖచితమగు సింహాసనమొకటున్నది. దానిపైనసూర్యభగవానుడు. దేవాలయముతోపాటు మొగసాల ఒక తామరపూవు మీద చెక్కివున్నది. మొగసాలకు నాల్గువైపులా ద్వారాలు. ఎంతో చక్కగా లలితకళలాగు రాయిమీద సుత్తిపెట్టిచెక్కివున్నది. ఆశ్రేణీలు, తామరపువ్వులు, లతలు అవన్నీ చూస్తే రమ్యముగా ఉండును. మొగసాలమ్ముఖాన మోరొక స్వతంత్రపీఠం మీద “నాట్యమందిరం” నిర్మింపబడిఉన్నది. దీనిని కొందరు భొగమంటపమని, మరికొందరు నాట్యమందిరమని అంటారు. అన్నివైపులా నర్తకులు భాజభజంత్రీలతో దేవార్చంబచేయటం కనబడుతోంది. ఆభంగిమలు ఈనాటి భరతనాట్యకళా ప్రదర్శకులు అనుకరించటానికి ఎంతో అనుకూలమని చెప్పవచ్చును. అంతేకాదు ఈ నాట్యమందిరము తామరపువ్వులతో నిండి ఉంది. దేవార్చనకు, భూషణానికి ప్రాచీనులు ఈపువ్వులనే వాడేవారు.
ఈ నాట్యమందిరం దగ్గిరగా ఒక పెద్దబండరాయి క్రిందపడి ఉంది. దానిమీద పెద్ద తామరపువ్వు చెక్కబడివున్నది. పూవు వ్యాసము 5 అడుగులు. పూదళాలు అప్సరసలు గానాభజానా చేస్తున్నత్లు కనిపిస్తారు. కేద్రంలో కూడా ఒక చిన్నపువ్వు. దీనిలో సూర్యభగవానుడు సప్తాశ్వరధారూఢుడై కూర్చొని ఉన్నాడు. ఇరువైపులా పరిచారికలు. చేతుల్లో పువ్వులు. శిల్పి ఎంత సూక్షంగా, రసవంతంగా చెక్కినాడో! ఈరాయి నాట్యమందిరం యొక్క గర్భముద్ర అని చెప్పుతారు.
మొగసాలకు ఉత్తరం వైపుగా ఉన్న రెండు ఏనుగు విగ్రహాలు ఉనాయి. అవి నిజం ఏనుగులా అన్నట్లు చెక్కినారు. ఏనుగు పొడవు 9 అడుగులు వెడల్పు 5 అడుగులు, ఎత్తు 9 అడుగులు. మొగసాలకు దక్షిణం వైపు విరాట్ స్వరూపంతో రెండు గుర్రాలుండేవి. ఇప్పుడవిలేవు. వాటి వీరావేశం, ఉన్మత్తభావాలను చూస్తే దర్శకులు భయపడేవారుట. వీటి పొడవు 10 అడుగులు, వెడల్పు 6 అడుగులు.
కోణార్కులోని పెద్దదేవాలయపు సమ్ముఖంలో అరుణస్తంభముండేది. దానిని మహారాష్ట్రులు పూరీకి తీసుకుపోయి, పూరీ సింహద్వారమందు స్థాపించి యున్నారు. అరుణుడు సూర్యుని రథసారథి. చేతులు జోదించి దేవుని ధ్యానిస్తున్నట్లు ఉంది. ఈ క్షేత్రానినే ఉల్లేఖిస్తూ శివాజీ ఏకామ్రకాననంలో భువనేశ్వరం “ఉత్కళ దేశం దేవతల ప్రియనికేతన” అని శంఖు పూరించాడు.
ఇంకా ఇక్కడ నవగ్రహాలు ఇక్కడ చూడవలసినదవి. తలలపై ముకుటం, పద్మాసనం వేసినట్లు చక్కబడినవి. ఇంకా ఎన్నో మూర్తులు కాలావస్థలో శిథిల పడినవి. ఈ మూర్తులన్నిటికీ ముఖ్యమైంది సూర్యప్రతిమ. ఈ సూర్యప్రతిమకు తలపై మకుటం, చెవుల్లో కుండలాలు, కంఠంలో హారం, మెడలో జెందెం, వాటిలో మువ్వలు, కటిప్రదేశంలో మేఖల, దానికింద గ్రంథిమాల- ఆ ఘటన మనోభావభంగిమలు ఎంతో స్వాభావికంగా జీవకళలు తొణికిసినట్లు కనిపిస్తోంది. ఈ ప్రతిమనుకూడా కొందరు బుద్ధదేవుని ప్రతిమ అని కొందరు భ్రమపడ్డారు. ఎంతో ప్రాచీన సంపద ఉన్న ఈ క్షేత్రం తప్పకుండా దర్శించవలసినదే.
This article is taken from : మహానుభావులు-mahanubhavulu