Sumithra Devi – A Cleaner | Sons became IAS, doctor, and engineer.

Sumithra Devi  – A Cleaner | Sons became IAS, doctor, and engineer.

చేసే పని చిన్నదైనా పెద్దదైనా …కష్టపడే మనస్తత్వం ఉండాలి. పనిని గౌరవించాలి.  అప్పుడే జీవితంలో అనుకున్నవి తీర్చుకోగలం.  నిజాయితీగా కష్టపడి పనిచేస్తే ప్రతి పనీ సులువే. కలలు కనండి కలలను సాకారం చేసుకోండి అన్న అబ్దుల్‌కలాంగారి సందేశాన్ని అక్షరాలా నిజం చేశారు సుమిత్రాదేవి.  ఆమె రోడ్లను ఊడ్చే క్లాస్ ఫోర్ ఉద్యోగిని. కష్టపడి పనిచేసి జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు అనుభవించినా లక్షాన్ని నెరవేర్చుకుంది. తన కుమారులు గొప్పవారిగా చూడాలన్న తన కలల్ని నెరవేర్చుకుంది.

ప్రతి ఒక్కరి జీవితంలో పదవీ విరమణ అనేది అపురూపమైనది. 60 ఏళ్ల సుమిత్రా దేవికి మాత్రం రిటైర్మెంట్ పార్టీ జీవితకాలం గుర్తుంచుకునేలా జరిగింది. ఏంటి ప్రత్యేకం అనుకుంటున్నారా… ఆమె రిటైర్మెంట్ సందర్భంగా ఏర్పాటుచేసిన ఫేర్‌వెల్ పార్టీకి ముగ్గురు ఆఫీసర్లు హాజరయ్యారు. ఇలాంటివి సహజమే కదా అనుకుంటున్నారు కదూ..! వచ్చినవారు ఒకరు కలెక్టర్, రెండో వారు డాక్టర్, మూడోవారు ఇంజినీర్. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమంటే వీళ్లు ముగ్గురూ ఆమె కుమారులే. సుమిత్రాదేవి రాజ్రప్ప గ్రామంలోని సిసిఎల్ టౌన్‌షిప్‌లోని రోడ్లను శుభ్రం చేయడం ఆమె ఉద్యోగ విధి. ముఫై సంవత్సరాల నుంచి ఆమె తన పనిని నిర్విఘ్నంగా చేస్తుంది. ఆమె తన విధులనుంచి పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. అక్కడి ప్రజలకు ఆమె రిటైర్మెంట్ అనేది చాలా ప్రత్యేకమైంది. ఆ కాలనీల వాళ్లు చివరి రోజు వరకు ఆమెతో ఎంతో అనుబంధాన్ని పెంచుకున్నారు. తమ మనిషిగా చూస్తూ ప్రేమాభిమానాలు పంచారు. తన ఫేర్‌వెల్ పార్టీలో తన తోటి కార్మికులు, ఆ కాలనీవాళ్లు అందరూ ఏర్పాట్లలో మునిగిపోయారు. అక్కడేమీ స్పెషల్ లేదు. కేవలం ఓ పారిశుద్ధ కార్మికురాలికి సన్మానం అంతే. అప్పటి వరకు అక్కడ ఉన్నవారికి అంతే తెలుసు. అకస్మాత్తుగా అక్కడ మూడుకార్లు వచ్చి ఆగాయి. ఎవర్నీ స్పెషల్ గెస్ట్‌గా పిలవలేదు . మరి కార్లలో వచ్చిందెవరు .అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎవరా అనుకుంటూ…ఒక కార్లోంచి బీహార్‌లోని సివాన్ కలెక్టర్. అతను కార్ దిగగానే సుమిత్రాదేవి కాళ్లకు నమస్కారం పెట్టాడు. అక్కడ ఉన్నవాళ్లు స్థాణువుల్లా అయిపోయారు. మిగతా రెండు కార్లలో దిగిన వారిలో ఒకరు రైల్వే ఇంజినీర్‌గా పనిచేసే వీరేంద్రకుమార్ సుమిత్రాదేవి పెద్దకుమారుడు రెండో కుమారుడు ధీరేంద్రకుమార్ డాక్టర్. మూడో కుమారుడు మహేంద్రకుమార్. ముగ్గురు కొడుకులూ తల్లి పాదాలను తాకగానే సమిత్రాదేవి కన్నీటిపర్యంతమయింది. అవి ఆనందబాష్పాలు. తన పై అధికారులు ఈ విధంగా తనను అభినందించడం ఆమెకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. తన పై అధికారితో ఆమె మాట్లాడుతూ సాబ్. గత ముఫై ఏళ్లుగా ఈ కాలనీలోని అన్ని వీధులను శుభ్రం చేస్తున్నాను. కానీ నా పిల్లలు మాత్రం మీకు లాగే ఆఫీసర్లు అంటూ కన్నీటి పర్యంతమైంది. తన పిల్లల్ని తన అధికారులకు పరిచయం చేసింది. అంతవరకు ఆమె పిల్లల గురించి అక్కడ ఎవ్వరికీ తెలీదు.

అక్కడ ఉన్నవారితో వాళ్ల కొడుకులు వాళ్ల అమ్మ కష్టాలను గుర్తుచేసుకున్నారు. అక్కడ ఉన్నవాళ్లంతా సుమిత్రాదేవిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆమెతో పనిచేసినందుకు గర్వపడ్డారు. వాళ్ల బిడ్డలు కూడా తమ తల్లి ఎన్ని కష్టాలు పడి తమను ఇంతవారిని చేసిందో అక్కడి వారితో పంచుకున్నారు. మాకోసం మా అమ్మ తన జీవితంతో చాలా వాటిని త్యాగం చేసింది. తన సంతోషాన్ని మాకు పంచింది. కష్టపడి చదవాలంటూ మమ్మల్ని ఎప్పుడూ ప్రోత్సహించేది. మనల్ని ఉన్నతులుగా చేసేది మన హార్డ్‌వర్కు అనేది. మమ్మల్ని ఆఫీసర్లుగా చూడాలనేది తన లక్షం. ఆమె లక్షాన్ని నెరవేర్చడమే మా కర్తవ్యంగా భావించాం. మేం మా అమ్మ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించాం.అయినా అమ్మ ఎప్పుడూ నిరుత్సాహ పడలేదు. ఇలాంటి తల్లి కడుపున పుట్టినందుకు మేం గర్వపడుతున్నాం అంటూ గుర్తుచేసుకున్నారు కలెక్టర్. మిగతా ఇద్దరు కూడా తల్లి తమను చదివించడానికి ఎంత కష్టపడిందో గుర్తుచేసుకున్నారు. అమ్మ కష్టాన్ని చూసి మేం ముగ్గురం మంచి ఉద్యోగాల్లో స్థిరపడి అమ్మను సంతోషపెట్టాలని నిర్ణయించుకున్నాం. కుమారులు ఉన్నత స్థానాల్లో ఉన్నా కూడా సుమిత్రా తన ఉద్యోగాన్ని వదిలేయలేదు. తన పని తను చేసుకుంటూనే ఉంది. తన పని అంటే తనకు దైవం అంటున్నారామె. ఈ ఉద్యోగం వల్లే నా కొడుకులను చదివించాను. వారింత ఉన్నత స్థానాల్లో ఉంచిన నా ఉద్యోగాన్ని ఎలా వదలాది అంటారామె.

Full Story Video link:-Sumithra Devi

Article Given By– Manatelangana news

omkrish