Atal Bihari Vajpayee Biography

మాజీ ప్రధాని, భారతరత్న, పద్మవిభూషణ్, ఉత్తమ పార్లమెంటేరియన్, నవ భారత నిర్మాత, వ్యాఖ్యాత, సుకవి, రచయిత, పార్టీలకు అతీతంగా భారతీయుల మనసులు గెలిచిన నేత, పార్టీ తొలి అధ్యక్షుడిగా కీర్తి గడించిన మహానేత Atal Bihari Vajpayeeగారు ( డిసెంబర్ 25 1924 – ఆగస్టు 16 2018)అటల్ బిహారీ వాజపేయి డిసెంబర్ 25 1924 న మధ్యప్రదేశ్ గ్వాలియర్ లోని ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. వాజపేయి గ్వాలియర్ లోని సరస్వతి శిశు మందిర్ లో విద్యాభ్యాసం చేశాడు. గ్వాలియర్ విక్టోరియా కళాశాలలో చేరి హిందీ, ఆంగ్లము, సంస్కృతంలో అత్యంత ప్రతిభావంతునిగా పట్టభద్రుడైనాడు. కాన్పూరు లోని దయానంద ఆంగ్లో వైదిక కళాశాలనుండి రాజనీతిశాస్త్రంలో ఎం.ఎ పట్టాను పొందాడు.యువకుడిగా ఉన్నప్పుడు బ్రిటిష్ కల్నల్ రూల్‌ను వ్యతిరేకించి వాజ్‌పేయి జైలుకెళ్లారు. కమ్యూనిజంతో కొన్నాళ్లు కాలం గడిపిన వాజ్‌పేయి ఆ తరవాత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), జన్ సంఘ్‌కు మద్దతు పలికారు.క్విట్ ఇండియా ఉద్యమం(1942-1945)లో పాల్గొని స్వాతంత్ర్య సమరయోధుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని వాజ్‌పేయి మొదలుపెట్టారు. ఒక కమ్యూనిస్టుగా వాజ్‌పేయి తన ప్రయాణాన్ని మొదలుపెట్టినా ఆర్ఎస్‌ఎస్‌లో సభ్యత్వం తీసుకొని హిందుత్వాన్ని, హిందూ జాతీయవాదాన్ని వినిపించి భారత రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు.1950ల్లో ఆర్ఎస్ఎస్ మ్యాగజైన్‌ను నిర్వహించడానికి వాజ్‌పేయి తన న్యాయశాస్త్ర (లా) విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆపేశారు. వాజ్‌పేయి రాజకీయ బీజాలు కూడా ఆర్ఎస్ఎస్‌లోనే పడ్డాయి.భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీకి వాజ్‌పేయి ప్రధాన అనుచరుడు. 1953లో కశ్మీర్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి వెళ్లినప్పుడు వాజ్‌పేయి.. ముఖర్జీ వెన్నంటే ఉన్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ ముఖర్జీ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఒక రాష్ట్రానికి ప్రత్యేక జెండా, ప్రధానమంత్రి ఉండటాన్ని ముఖర్జీ తీవ్రంగా నిరసించారు. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానమంత్రులు, రెండు జాతీయ పతాకాలు ఉండటాన్ని సహించలేమని పేర్కొన్నారు. అయితే ముఖర్జీని నిరాహారదీక్ష చేయనివ్వకుండా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ని అరెస్టు చేసింది. ఆ తరవాత కొన్ని వారాలకు ఆయన మరణించారు. ముఖర్జీ పోరాటం ఫలితంగా కశ్మీర్ వెళ్లడానికి గుర్తింపుకార్డు నిబంధనను ప్రభుత్వం తొలగించింది. ఈ పరిణామాలన్నీ యువ వాజ్‌పేయిపై ప్రభావం చూపాయి.వాజ్‌పేయి తొలిసారి 1957 పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించారు. వాజ్‌పేయి 1957 నుంచి 2009 వరకు మొత్తం 10 సార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.బీజేపీ తొలి అధ్యక్షుడిగా నియమితులైన వాజ్‌పేయి పూర్తిగా ఐదేళ్లపాటు ప్రధానిగా ఉన్న తొలి కాంగ్రెసేతర నేతగానూ రికార్డుకెక్కారు.నాలుగు దశాబ్దాల తరవాత ప్రతిపక్షం నుంచి పూర్తికాలం ప్రధాన మంత్రిగా ఉన్నది కూడా వాజ్‌పేయి కావడం విశేషం. ఆయన తొలిసారి 1996లో ప్రధాని పీఠం ఎక్కారు. అయితే కేవలం 13 రోజులు మాత్రమే ప్రధానిగా ఉన్నారు. ఆ తరవాత 1998 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో వాజ్‌పేయి మళ్లీ ప్రధాని అయ్యారు. 13 నెలల పాలన అనంతరం అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత తమ మద్దతు ఉపసంహరించుకోవడంతో వాజ్‌పేయి ప్రభుత్వం పడిపోయింది. అయితే 1999లో జరిగిన ఎన్నికల్లో వాజ్‌పేయి మళ్లీ ప్రధానిగా ఎన్నికయ్యారు. 2004 వరకు పనిచేశారు. దీంతో పూర్తి పదవీకాలం పనిచేసిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా చరిత్రకెక్కారు.వాజ్‌పేయి అద్భుతమైన వ్యాఖ్యాత కూడా. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల శాఖా మంత్రిగా ఉన్న వాజ్‌పేయి.. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో హిందీలో ప్రసంగించిన తొలి నేతగా నిలిచారు.1999 ఫిబ్రవరిలో చరిత్రాత్మక ఢిల్లీ – లాహోర్ బస్సు సర్వీసును ప్రారంభించిన ప్రధాని వాజ్‌పేయి బస్సులోనే పాక్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత 2004 జనవరి 4-6 మధ్య జరిగిన సార్క్ 12వ సమావేశంలో పాల్గొనేందుకు వాజ్‌పేయి ఇస్లామాబాద్‌కు వెళ్లారు.1974 లో తొలిసారిగా “ప్రోఖ్రాన్-I” అణుపరీక్ష జరిపిన భారతదేశం, మళ్ళీ 24 సంవత్సరాల తరువాత, 1998 మే నెలలో భారతదేశం రాజస్థాన్ లోని పోఖ్రాన్ ఎడారిలో ఐదు భూగర్భ అణు పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షను “ప్రోఖ్రాన్-II”గా వ్యవహరిస్తారు. వాజపేయి ప్రభుత్వం యేర్పడిన నెలరోజులలోనే ఈ పరీక్షలు జరిగినవి.2001 లో వాజపేయి ప్రభుత్వం, ప్రాథమిక, మాధ్యమిక విద్యాభివృద్ధి లక్ష్యంగా సర్వశిక్షా అభియాన్ అనే ప్రసిద్ధ కార్యక్రమాన్ని ప్రారంభించింది.వాజపేయి మూడవ దఫా పరిపాలనా కాలంలో అనేక దేశీయ ఆర్థిక, మౌలిక సంస్కరణలను చేపట్టాడు. వాటిలో ప్రైవేటు రంగాన్ని, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించాడు. కొన్ని ప్రభుత్వరంగ సంస్థలలో పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించాడు. ప్రభుత్వపు వృధాఖర్చులను తగ్గించి, పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించారు. కొన్ని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించాడు.గత 32 సంవత్సరాలలో అభివృద్ధి చెందిన రోడ్లలో సగం వరకు, వాజపేయి నేతృత్వంలోని ఎన్.డి.ఎ ప్రభుత్వం యొక్క ఐదేళ్ల పాలనలో అభివృద్ధి చెందినవే అని యు.పి.ఏ ప్రభుత్వం 2013, జూలై 1న సుప్రీంకోర్టు ఎదుట అంగీకరించింది. “నేషనల్ హైవే డెవలప్‌మెంటు ప్రాజెక్టు”, “ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన” వాజపేయి అభిమాన ప్రాజెక్టులు.పోటీతత్వం పెంపొందించడం, సమాచార సాంకేతికత, ఇతర సాంకేతిక పరిశ్రమలకు అదనపు పెట్టుబడి, మద్దతు సమాకూర్చడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, వర్తక, పెట్టుబడులు, వాణిజ్య చట్టాలపై నియంత్రణ సడలించడం వంటి చర్యలన్నీ విదేశీ పెట్టుబడులు పెరిగేందుకు దోహదం చేసి, ఆర్థికరంగ విస్తరణకు శ్రీకారం చుట్టాయి.2000 మార్చిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు, బిల్ క్లింటన్ అధికారిక పర్యటనపై భారతదేశాన్ని సందర్శించారు. 22 యేళ్లలో భారత దేశాన్ని సందర్శించిన మొట్టమొదటి అధ్యక్షుడు ఆయనే. అమెరికా అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించడం ఇరు దేశాల మధ్య సంబంధాల పురోగతికి ముఖ్యమైన మైలురాయిగా చెప్పవచ్చు.భారతదేశ రాజ్యసభలో అప్పటి ప్రధాని డా.మన్మోహన్ సింగ్ తన ప్రసంగంలో వాజపేయిని రాజకీయ భీష్మునిగా అభివర్ణించాడు.సంతానం లేని వాజపేయి, నమిత అనే అమ్మాయిని దత్తత తీసుకున్నాడు. ఆయనకు భారతీయ సంగీతం, నాట్యం అంటే ఇష్టం. ప్రకృతి ప్రేమికుడైన వాజపేయికి హిమాచల ప్రదేశ్ లోని మనాలీ ప్రాంతమంటే ఎనలేని ఇష్టం.వాజపేయి వేలాది మంది ముందు, పార్లమెంటులోనూ కవితాత్మకంగా, జనరంజకంగా, పలు విషయాలు ప్రస్తావిస్తూ ప్రసంగించేవాడు. అప్పటికి స్వాతంత్ర్యోద్యమ నేతగా, భారత ప్రధానిగా లబ్ధప్రతిష్ఠుడైన నెహ్రూ సైతం యువకుడైన, ప్రతిపక్ష నాయకుడు వాజపేయి ప్రసంగాలను శ్రద్ధగా విని ప్రశంసించేవాడు. బ్రహ్మచారిగా ఉండిపోయిన ఈ బీజేపీ కురువృద్ధుడు, మంచి కవిగానూ కీర్తి సంపాదించారు.2018 ఆగస్టు 16 సాయంత్రం అటల్ బిహారీ వాజపేయి ఢిల్లీలో మరణించాడు.