BABA ka DHABA Viral Social Media

కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసింది. ఉపాధి లేక ఎంతో మంది రోడ్డున పడ్డారు. రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారం చేసే వారి పరిస్థితి దారుణంగా తయారయింది. గిరాకీ లేక.. కుటుంబం గడవక.. ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కుటుంబాన్ని పోషించుకోలేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ వృద్ధ దంపతుల పరిస్థితి కూడా ఇంచు మించు అలాగే ఉంది. 80 ఏళ్ల ఈ వృద్ధుడు తన భార్యతో కలిసి ఢిల్లీలోని మాళవీయనగర్‌లో ‘బాబా కా దాబా‘ (Baba ka dhaba) పేరుతో చిన్న దాబా నడుపుతున్నాడు. 30 ఏళ్లుగా ఇదే పనిచేస్తున్నారు. కరోనా రాకముందు గీరాకీ బాగానే ఉండేది. కానీ కరోనా తర్వాత పరిస్థితి తలకిందులయింది. నెలల పాటు హోటళ్లు మూతపడడం, తెరచుకున్న తర్వాత బయటి ఆహారం తినేందుకు జనాలు భయపడుతున్న నేపథ్యంలో.. గిరాకీ లేక.. డబ్బులు రాక..తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ఐతే ఇటీవల ఓ యూట్యూబర్ బాబా దాబాను సందర్శించాడు. ఏం తాత గిరాకీ ఎలా ఉంది? ఎంత సంపాదిస్తున్నావు? అని అడిగాడు. ఆ మాట విన్న వెంటనే పెద్దాయనకు కన్నీళ్లు ఆగలేదు. గల్లా పెట్టెలో నుంచి రూ.10 మాత్రమే తీసి చూపించాడు. నాలుగు గంటల్లో కేవలం రూ.50 మాత్రమే వచ్చాయట. ఆ పెద్దాయన వీడియో తీసిన యూట్యూబర్.. వారి దాబాలోని ఆహార పదార్థాలను చూపించాడు. ఇంత మంచి క్వాలిటీ ఆహారం స్టార్ హోటళ్లలో కూడా దొరకదు అని చెప్పారు. ‘ఏం కాదు.. ఏడవకు.. దేవుడు చల్లగా చూస్తాడు.’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం ఆ వీడియోను వసుంధర్ తనఖా శర్మ అనే మహిళ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. వీడియో చూసి నా గుండె పగిలిందని.. మనసున్న వారంత అక్కడికి వెళ్లి భోజనం చేయండని సూచించింది. రాత్రి 10గంటల సమయంలో చేసిన ట్వీట్ సునామీ సృష్టించింది.
#SupportLocal #BABAKADHABA పేరుతో లక్షలాది మంది నెటిజన్లు ఆ వీడియోను రిట్వీట్ చేశారు. #BABAKADHABA గురువారం ఉదయం నుంచి ఈ హ్యాష్ ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పటి వరకు 22 లక్షల మందికిగా పైగా వీక్షించారు. సోషల్ మీడియాలో వీడియో చూసిన చాలా మంది మాళవీయనగర్‌లోని బాబా దాబాకు వెళ్లి భోజనం చేస్తున్నారు. ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆ పెద్దాయన నవ్వుతున్న ఫొటోను చూసి చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంత హ్యాపీగా ఉందో అని ట్వీట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా పవర్ అంటే ఇది అని హర్షం వ్యక్తం చేస్తున్నారు
ఈ వీడియోపై స్పందించిన వారిలో సోనమ్ కపూర్, రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ టీం, ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సంస్థలు ఉన్నాయి. ఇక వృద్ధ దంపతులకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. బాబా కా ధాబాలో లంచ్ చేస్తామంటూ మరి కొందరు సెలబ్రిటీలు మాటిచ్చారు.
This article taken from :News 18 Telugu