Medaram Sammakka Sarakka Jatara History

మన దేశంలోనే అతి పెద్ద గిరిజన ఉత్సవం మేడారం సమ్మక్క సారక్క జాతర. ఈ జాతర ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ మాసంలో శుద్ధ పౌర్ణమి నాడు ఈ ఉత్సవం ఘనంగా జరుపుతారు. భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి పది కోట్ల మందికి పైగా హాజరు అవుతారని అంచనా.ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది.సుమారు 700 సంవత్సరాల చరిత్ర గలది సమ్మక్క సారక్క జాతర, దీన్నే మేడారం జాతర అని కూడా పిలుస్తారు.మన రాష్ట్రము నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, ఒడిషా, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్దీ భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. 13 వ శతాబ్దంలో మేడారం కాకతీయుల పరిపాలనలో ఉండేది. మేడారం సమీపంలో గల అడవిలో గిరిజనులు ఒకరోజు వేటకు వెళుతూ ఉండగా అక్కడ సింహాలు కాపలాగా ఉన్న పసిపాపను గమనించారు. ఆ పాపను వారు స్వీకరించి దైవ స్వరూపంగా భావించారు. తాము ఆమెకు సమ్మక్క అని నామకరణం చేసారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని పొలవాస ను పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి వివాహం జరిగింది. వారికి జంపన్న, సారలమ్మ, నాగులమ్మ అనే సంతానం కలిగారు. » అంతా సజావుగా గడుస్తుండగా మేడారంలో కరువు సంభవించింది. ఇలాంటి పరిస్థితుల్లో కప్పం కట్టమని మేడారాన్ని పాలిస్తున్న కాకతీయ రాజు మొదటి ప్రతాపరుద్రుడు పగిడిద్ద రాజుకు ఆదేశం పంపాడు. తమకు పంటలు లేవని, కప్పం చల్లించలేమని పగిడిద్ద రాజు వేడుకున్నాడు. అదంతా పట్టించుకోని ప్రతాపరుద్రుడు గిరిజనులపై యుద్ధం ప్రకటించాడు. “సంపంగి వాగు” అనే ప్రాంతం దగ్గర భీకర యుద్ధం ప్రారంభం అయ్యింది. అసంఖ్యాకంగా ఉన్న కాకతీయ సైన్యం, గిరిజనుల చేతిలో కుప్పకూలిపోసాగారు. ఇది గమనించిన శత్రుసైన్యం పగిడిద్ద రాజునూ వెనకనుండి పొడిచి చంపారు. ఈ విషయం తెలుసుకున్న సమ్మక్క అల్లుడు గోవిందరాజు, కూతురు సారలమ్మ యుద్ధంలో ప్రవేశించారు. సమ్మక్క అసామాన్య యుద్ధ ప్రతిమకు కాకతీయ సైన్యం కనుమరుగు కాసాగింది. దీనితో భ్రాంతి చెందిన శత్రుసైన్యం సమ్మక్క, సారలమ్మలను కుడా వెనుకనుండి పొడిచారు. జంపన్నను చంపి, వాగులో పడేశారు, అప్పటినుండి అది జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. » సమ్మక్క మాత్రం శరీరం నిండా ఉన్న బాణాలతో నడుస్తూ ముందుకు సాగింది, ఆమెను వెతుక్కుంటూ గిరిజనులు వెళ్లారు. కానీ అక్కడ సమ్మక్క కనిపించలేదు సమ్మక్కను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు, కానీ ఆ ప్రాంతములో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణె లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. » అప్పటినుండి ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి సమ్మక్కను చిలకల గుట్టనుంది మేడారం కన్నెపల్లిలో ఉన్న సారలమ్మ దగ్గరికి తీసుకువొస్తరు. సమ్మక్క, సారలమ్మను గద్దెలు ఏర్పాటు చేస్తారు. ఈ గద్దెలలో వారికి నిలిపి కొలుస్తారు. జాతర అనంతరం సమ్మక్క, సారలమ్మలను వారి స్వయంగా వెలసిన స్థలాలకు తిరిగి చేరుస్తారు.