విశ్వవిజేతను ఓడించిన 16 ఏళ్ల కుర్రాడు

విశ్వవిజేతను ఓడించిన 16 ఏళ్ల కుర్రాడు

చదరంగం ఓ ఆట మాత్రమే కాదు. మెదడును చెస్ బోర్డు మీద పరిచి నడిపే యుద్ధం. ఒకో పావుకు ఒకో బలం, ఒకో బలహీనత. వాటన్నింటినీ గమనించుకుంటూ ఎత్తుకు, పై ఎత్తు వేస్తూ శత్రువును కదలకుండానే చిత్తు చేసే తంత్రం. భారతీయులది అని చెప్పుకునే ఈ ఆటను ప్రపంచమే తలకెత్తుకుంది. అలాంటి ఆటలో ఓ అద్భుతం జరిగింది.అది ప్రతిష్టాత్మకమైన ‘Airthings Masters’ అనే చెస్ పోటీ. ఆ ఆన్లైన్ పోటీలో నెగ్గేందుకు అంతర్జాతీయ క్రీడాకారులు అంతా సిద్ధంగా ఉన్నారు. వాళ్లలో ఓ 16 ఏళ్ల కుర్రాడు. పేరు Rameshbabu Praggnanandhaa. అప్పటికి అతను టోర్నమెంటులో 12వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి అతను ఇక ముందుకు సాగడం కష్టమే అని అందరూ నిర్ణయించేసుకున్నారు. పైగా వచ్చే మ్యాచ్ ‘కార్ల్ సన్’ తో కాబట్టి… అదే అతని నిష్క్రమణకు సమయం అనుకున్నారు.మాగ్నస్ కార్ల్ సన్ అంటే మాటలు కాదు. ప్రపంచ చెస్ చరిత్రలోనే ప్రతిభావంతుడైన ఆటగాళల్లో ఒకడు. 12 సంవత్సరాలుగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. పొరపాటున కూడా అతన్ని ఓడించడం అసాధ్యం అని క్రీడాలోకపు నమ్మకం. మన దేశం తరఫు నుంచి ఇప్పటివరకూ ఇద్దరు మాత్రమే తనను ఓడించగలిగారు. ఒకరు ఆనంద్, మరొకరు హరికృష్ణ. ఇక 16 ఏళ్ల వయసువాళ్లు ఏనాడూ తనని దాటి వెళ్లింది లేదు. అలా పరిస్థితులన్నీ ప్రజ్ఞానందకు వ్యతిరేకంగానే ఉన్నాయి!ఆట మొదలైంది. ప్రజ్ఞానందకు నలుపు పావులు వచ్చాయి. చెస్ లో తెలుపు పావులనే మొదట కదిపే అవకాశం ఉంటుంది కాబట్టి… వాళ్లకే విజయావకాశాలు ఎక్కువ ఉంటాయని ఓ అభిప్రాయం. కానీ పోరాటానికి శకునాలతో, పరిస్థితులతో పని ఉండదని ప్రజ్ఞానందకు తెలుసు. ఆట సాగుతోంది. చూస్తూచూస్తుండగానే… ప్రజ్ఞానంద ఎత్తులు కార్ల్ సన్ ను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాయి. సమయం గడిచేకొద్దీ అంతటి ఆటగాడు కూడా వెనకబడిపోయాడు. చివరికి చేతులెత్తేశాడు. ప్రజ్ఞానంద 39 ఎత్తుల్లోనే మాగ్నస్‌ను ఇంటికి పంపాడు. ప్రస్తుతం భారత యువ మాస్టర్‌ ప్రజ్ఞానంద 8 పాయింట్లతో 8 రౌండ్ల తర్వాత 12వ స్థానంలో నిలిచాడు. టోర్నీలో రెండు డ్రాలు, నాలుగు ఓటములను కూడా చవిచూశాడు.16 ఏళ్ల ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు! టెండుల్కర్ లాంటి దిగ్గజాలంతా తనను పొగడ్తలతో ముంచెత్తారు. లోకం అంతా ఒక్కసారిగా ఎవరీ కుర్రాడు అని తలెత్తి చూసింది. అప్పుడు కానీ అర్థం కాలేదు. అతని విజయం గాలివాటంగా రాలేదని. చెన్నైకి చెందిన ప్రజ్ఞానంద, ఎనిమిదేళ్ల వయసులోనే చదరంగంలో అద్భుతాలు సృష్టించాడు. పదేళ్లకే ‘ఇంటర్నేషనల్ మాస్టర్’ హోదా సంపాదించాడు. ప్రపంచ చరిత్రలోనే ఇది రికార్డు వయసు. అంతేకాదు! అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ అయిన వ్యక్తులలో తను అయిదవ వ్యక్తి.తమిళనాడులోని చెన్నైలో 2005లో జన్మించిన రమేశ్‌బాబు ప్రజ్ఞానంద, 2013లో అండర్ 8 వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్ గెలిచిన ప్రజ్ఞానంద, ఏడేళ్ల వయసులో ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ మాస్టర్ టైటిల్ సాధించాడు…10 ఏళ్ల 10 నెలల 19 రోజుల వయసులో ఇంటర్నేషనల్ మాస్టర్‌గా నిలిచిన ప్రజ్ఞానంద, తన వయసు కంటే రెట్టింపు అనుభవం ఉన్న వ్యక్తులను కూడా ఆశ్చర్యపరుస్తూ.. విశ్వ వేదికపై దూసుకుపోతున్నాడు.ప్రజ్ఞానంద అక్కయ్య వైశాలి చదరంగం బాగా ఆడుతుంది. తనని చూసి, ఆట మీద అభిరుచి పెంచుకున్నాడు. దానికి కుటుంబమూ అండగా ఉంది. అతను పోటీల కోసం ఎక్కడికి వెళ్లినా.. తల్లి వెంటవెంటే వెళ్తూ ప్రజ్ఞానందకు కావల్సిన సదుపాయాలన్నీ చూసుకునేది. ఇంటికి దూరమైన లోటు రానిచ్చేది కాదు. వాళ్ల వెంటే ఒక ఇండక్షన్ స్టవ్, బియ్యం, మసాలాలు ఉండేవి.తన ఏకాగ్రత చెదరకుండా ఉండటానికి, ప్రజ్ఞానంద సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉండేవాడు. దారుణమైన ఓటములనీ, ఆకాశానికెత్తేసే గెలుపునూ ఒకేలా తీసుకునే తత్వం అలవాటు చేసుకున్నాడు. అందుకే కార్ల్ సన్ మీద గెలిచాక విలేకరులు ‘మీరు ఈ గెలుపును ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు’ అని అడిగితే… ‘ఏం లేదు… ఎప్పటిలాగే రూమ్ కి వెళ్లి పడుకుంటాను’ అని విస్తుపోయే జవాబిచ్చాడు. ఇప్పుడు ప్రజ్ఞానంద ఇప్పుడు గెలుపు ఓటములకు అతీతం. నూటిని నూరు శాతం ఆడటమే తన లక్ష్యం!

For more blog :- Real Life Stories

omkrish