సచిన్ రమేష్ టెండుల్కర్ గురించి

సచిన్ రమేష్ టెండుల్కర్ గురించి

ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన భారతీయ ఆటగాడు సచిన్ రమేష్ టెండుల్కర్ (Sachin Ramesh Tendulkar). క్రికెట్ క్రీడకు భారతదేశంలో అత్యధిక జనాదరణకు కారకుడై, చిన్న పిల్లలు మొదలు ముసలివాళ్ళ మనసులను సైతం దోచుకున్న వర్తమాన క్రికెటర్ టెండుల్కర్ ఏప్రిల్ 24, 1973 న జన్మించాడు.

16-నవంబర్-2013 నాడు తన 40వ ఏట 200వ టెస్ట్ మ్యాచ్ పూర్తి చేసి, అంతర్జాతీయ క్రీడారంగం నుంచి విరమించుకుంటున్న సందర్భంలో భారతప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను ఈయనకు ప్రకటించింది. ఈ విధంగా ఈ అవార్డును పొందిన ప్రథమ క్రీడాకారునిగా మరో రికార్డు నెలకొల్పాడు సచిన్ టెండూల్కర్.

ఈనాడు భారత్ లో ఈ క్రీడకు ఇంత జనాదరణ ఉందంటే అదంతా సచిన్, అతని ఆట తీరు కూడా ఒక కారణం. 1990 దశకంలో భారత క్రికెట్ లో మెరుపులు మెరిపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆటగాడు సచిన్. భారత జట్టుకు ఆపద్భాందవుడిగా ఎన్నో విజయాలు అందజేసిన ఈ ముంబాయికి చెందిన బ్యాట్స్‌మెన్ ను పొగడని వారు లేరనే చెప్పవచ్చు. 2002లో విజ్డెన్ పత్రిక టెస్ట్ క్రికెట్ లో ఆస్ట్రేలియాకు చెందిన డాన్ బ్రాడ్‌మెన్, వన్డే క్రికెట్ లో వెస్ట్‌ఇండీస్ కు చెందిన వివియన్ రిచర్డ్స్ ల తర్వాత క్రికెట్ క్రీడా ప్రపంచంలోనే సచిన్ ను రెండో అత్యున్నత బ్యాట్స్‌మెన్ గా ప్రకటించింది. 2003లో మళ్ళి తిరగరాసి వన్డే క్రికెట్ లో వివియన్ రిచర్డ్స్కు రెండో స్థానంలోకి నెట్టి సచిన్ ను అగ్రస్థానంలో నిలబెట్టారు. అతని యొక్క ఆటతీరు, ఆట లోని నైపుణ్యం ఎంత చూసిననూ తనవి తీరదని అభిమానుల నమ్మకం. అతను అవుటైన వెంటనే టి.వి.లను కట్టేసిన సందర్భాలు, స్టేడియం నుంచి ప్రేక్షకులు వెళ్ళిన సందర్భాలు కోకొల్లలు. టెస్ట్ రికార్డులు చూసిననూ, వన్డే రికార్డులు చూసిననూ అడుగడుగునా అతని పేరే కనిపిస్తుంది. లెక్కకు మించిన రికార్డులు అతని సొంతం.టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పరుగులలో అక్టోబర్ 17, 2008 న వెస్ట్‌ఇండీస్ కు చెందిన బ్రియాన్ లారాను అధికమించి మొదటి స్థానం సంపాదించాడు. వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగుల రికార్డు అతనిదే. ఇక సెంచరీల విషయంలో అతనికి దరిదాపుల్లో ఎవరూ లేకపోవడం గమనార్హం. లిటిల్ మాస్టర్ లేదా మాస్టర్ బ్లాస్టర్ అని పిలువబడే సచిన్ 1989లో అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేశాడు. 1997-1998లో రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పొంది ఈ అవార్డు స్వీకరించిన ఏకైక క్రికెట్ క్రీడాకారుడిగా నిల్చాడు. ఇప్పటి వరకు క్రికెట్ క్రీడా జగత్తులోని అత్యంత ప్రముఖమైన క్రీడాకారులలో ఒకరు సచిన్ టెండుల్కర్..

2010 ఫిబ్రవరి 24 న దక్షిణాఫ్రికాతో జరిగిన ఒకరోజు అంతర్జాతీయ మ్యాచ్ లో సచిన్ 200 పరుగులు సాధించిన మొట్ట మొదటి ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. అలాగే 2010 డిసెంబర్ 19 న దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో తన 50వ సెంచరి పూర్తి చేసి టెస్టుల్లో మరే క్రికెటర్ అందుకోని మైలురాయిని అధిరోహించాడు. 2012, మార్చి 16న అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో (వన్డేలు, టెస్టులు కలిపి) ఎవరూ సాధించని 100వ సెంచరీతో కొత్తరికార్డు సృష్టించాడు.

Playing It My Way Book

బాల్యం, కుటుంబ జీవితం
సచిన్ టెండుల్కర్ ముంబాయి (పూర్వపు బొంబాయి) లోని సారస్వత బ్రాహ్మణ కుటుంబంలో ఏప్రిల్ 24, 1973 న జన్మించాడు. తండ్రి రమేష్ మరాఠీ నవలా రచయిత. 1995లో గుజరాత్ పారిశ్రామికవేత్త ఆనంద్ మెహతా కూతురు అంజలిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం. సారా (జననం అక్టోబర్ 12, 1997), అర్జున్ (జననం సెప్టెంబర్ 23, 1999.

క్రీడా జీవితం:

దేశవాళీ క్రికెట్
1988/1989 లో అతని మొట్టమొదటి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ముంబాయి తరఫున ఆడుతూ గుజరాత్ పై 100* పరుగులు సాధించాడు. 15 సం.ల 232 రోజుల వయస్సులోనే ఫస్ట్ క్లాస్ సెంచరీ సాధించి ఆ ఘనతను సాధించిన యువ బ్యాట్స్‌మెన్ గా అవతరించాడు. అంతేకాకుండా రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ లలో కూడా తను ఆడిన తొలి మ్యాచ్ లలోనే సెంచరీలు సాధించి ఆ ఘనతను పొందిన ఏకైక క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు.

అంతర్జాతీయ క్రికెట్
టెండుల్కర్ వ్రాయడంలో ఎడమచేతి వాటం ఉపయోగించిననూ, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లలో మాత్రం కుడిచేతినే ఉపయోగిస్తాడు. టెండుల్కర్ తన తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ 1989లో పాకిస్తాన్ పై ఆడి కేవలం 15 పరుగులకే వకార్ యూనిస్ బౌలింగ్ లో అవుటయ్యాడు. వకార్ కు కూడా ఇదే తొలి టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం. ఆ తర్వాత ఫైసలాబాద్ లో తన తొలి అర్థశతకం పూర్తిచేశాడు. డిసెంబర్ 18 న ఆడిన తన తొలి వన్డే మ్యాచ్ లో కూడా వకార్ యూనిస్ బౌలింగ్ లోనే డకౌట్ అయ్యాడు. పాకిస్తాన్ సీరీస్ తర్వాత న్యూజీలాండ్ టూర్ లో రెండో టెస్ట్ లో 88 పరుగులు సాధించాడు. 1990 ఆగష్టులో ఇంగ్లాండు లోని ఓల్డ్ ట్రఫర్డ్ లో జరిగిన మ్యాచ్ లో తన తొలి శతకం సాధించాడు. 1991-1992లో ఆస్ట్రేలియా టూర్ లో ప్రపంచ శ్రేణి బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. షేన్‌వార్న్ టెస్ట్ మ్యాచ్ లో రంగప్రవేశం చేసిన సిడ్నీ మ్యాచ్ లో 148 పరుగులు చేశాడు. ఆ తర్వాత పెర్త్ మ్యాచ్ లో మరో సెంచరీ సాధించాడు.

టెండుల్కర్ ప్రతిభ 1994-1999 సంవత్సరాలలో ఉన్నత శిఖరాలకు చేరింది. 1994లో ఆక్లాండ్ వన్డేలో టెండుల్కర్‌ను ఓపెనర్‌గా పంపించారు.. ఆ వన్డేలో 49 బంతుల్లోనే 82 పరుగులను సాధించాడు. సచిన్ టెండుల్కర్ 1994, సెప్టెంబర్ 27 న ఆస్ట్రేలియాపై తన తొలి వన్డే సెంచరీ సాధించాడు. తొలి వన్డే శతకం సాధించడంకోసం 79 మ్యాచ్ లు ఆడాల్సి వచ్చింది.

1996 ప్రపంచ కప్ : తన ప్రతిభను అలాగే కొనసాగిస్తూ 1996 ప్రపంచ కప్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్‌గా నిల్చాడు. ఆ ప్రపంచ కప్ లో 2 శతకాలు సాధించాడు.1998 ప్రారంభంలో భారత్ విచ్చేసిన ఆస్ట్రేలియా క్రికెట్ టీం పై వరుసగా 3 సెంచరీలు సాధించి బ్యాటింగ్ లో తన ప్రతిభను మరింతగా మెరుగుపర్చుకున్నాడు. అందులోనే షేన్‌వార్న్, రోబర్ట్ సన్ లను లక్ష్యంగా ముందస్తు ప్రణాళిక వేసుకున్నట్లు వారి బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. అతని ఫలితంగా భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది. ఆ సీరీస్ తర్వాత సచిన్ తన బౌలింగ్ ను ఉతికి ఆరేసినట్లు రాత్రి కలలో వచ్చినట్లు వార్న్ పేర్కొనడం విశేషం.

1999 ప్రపంచ కప్ : 1999 ప్రపంచ కప్ పోటీలో ఉండగా అతని తండ్రి రమేష్ టెండుల్కర్ మృతిచెందారు. తండ్రి అంతిమక్రియల కొరకు భారత్ రావడంతో జింబాబ్వేతో ఆడే మ్యాచ్ కోల్పోయాడు. వెంటనే మళ్ళీ ప్రపంచ కప్ పోటీలకు హాజరై కెన్యా పై బ్రిస్టన్లో జరిగిన మ్యాచ్ లో 101 బంతుల్లోనే 140 పరుగులు చేసాడు. ఈ శతకం తన తండ్రికి అంకితం ఇచ్చాడు.

షేర్‌వార్న్ కు సింహస్వప్నం : 1998 ఆస్ట్రేలియా పర్యటనలో సచిన్ మంచి ఊపుపై ఉండి 3 సెంచరీలను సాధించాడు. ప్రముఖ స్పిన్నర్ షేన్‌వార్న్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో ముందుగానే నిర్ణయించిన విధంగా ఎదుర్కొని బంతిని బౌండరీలు దాటిస్తుంటే వార్న్ నిశ్చేతుడిగా చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది. రాత్రివేళల్లో సచిన్ స్వప్నంలోకి వచ్చాడని కూడా వార్న్ పేర్కొనడం గమనార్హం.

నాయకత్వం : ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా అజహరుద్దీన్ నుంచి సచిన్ తెండుల్కర్ కు నాయకత్వ పగ్గాలు అప్పగించారు. కాని ఈ సీరీస్ కొత్త ప్రపంచ చాంపియన్ చేతిలో 3-0 తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత 2-0 తేడాతో దక్షిణాఫ్రికాపై కూడా ఓడిపోవడంతో సచిన్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.అతని తర్వాత 2000లో సౌరవ్ గంగూలీకి కెప్టెన్సీ ఇవ్వబడింది.

2003 ప్రపంచ కప్ : 2003 ప్రపంచ కప్ లో సచిన్ 11 మ్యాచ్ లలో 673 పరుగులు సాధించి భారత్ ను ఫైనల్స్ కి చేర్చాడు. కాని ఈసారి కూడా ఆస్ట్రేలియానే విజయం వరించింది. అయినా మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డ్ మాత్రం ఉత్తమ ఆటతీరును ప్రదర్శించిన సచిన్ నే వరించింది. 2003-04 లో భారత్ ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో సచిన్ డబుల్ సెంచరీ సాధించాడు.

అత్యధిక టెస్ట్ సెంచరీల రికార్డు : డిసెంబర్ 10, 2005 న ఢిల్లీ లోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో శ్రీలంక పై ఆడుతూ 35 వ టెస్ట్ సెంచరీ సాధించి క్రికెట్ ప్రపంచంలోనే అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్ గా అవతరించాడు. దీంతో ఇది వరకు సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న 34 టెస్ట్ సెంచరీల రికార్డును విచ్ఛిన్నమైంది.

2007 ప్రపంచ కప్ : వెస్ట్ఇండీస్ లో జరిగిన 2007 ప్రపంచ కప్ లో రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో లోయర్ ఆర్డర్ బ్యాంటింగ్ చేసి పేలవమైన్ స్కోరు సాధించాడు. బంగ్లాదేశ్ పై 7 పరుగులు, బెర్ముడా పై 57* పరుగులు, శ్రీలంక పై సున్నా పరుగులు చేసాడు. దాంతో భారత జట్టు కోచ్ గ్రెగ్ చాపెల్ సోదరుడైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ సచిన్ క్రికెట్ నుంచి రిటైరవ్వాలని ముంబాయికి చెందిన మధ్యాహ్న పత్రికలో కాలమ్ రాసి సంచలనం సృష్టించాడు.

11000 పరుగులు పూర్తి : జూలై 28, 2007 నాటింఘమ్ టెస్టు రెండో రోజున సచిన్ టెస్ట్ క్రికెట్ లో 11000 పరుగులు పూర్తిచేసి ఈ ఘనతను సాధించిన మూడవ బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. కాగా భారతీయులలో ఈ ఘనత పొందిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్ గా రికార్డు సృష్టించాడు

1997లో విజ్డెన్ పత్రిక సచిన్ ను క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించింది. ఆ క్యాలెండర్ సం.లో సచిన్ తొలిసారిగా 1000 పరుగులు పూర్తిచేసాడు. ఆ తర్వాత 1999, 2001, 2002 లలో కూడా సచిన్ ఈ ఘనతను సాధించాడు.

50వ టెస్ట్ సెంచరి : డిసెంబర్ 19, 2010 న సెంచూరియన్ టెస్ట్ నాలుగవ రోజున ప్రత్యర్థి దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టేన్ బౌలింగ్లో సెంచరి పూర్తి చేసి టెస్టుల్లో మొదటిసారి 50 సెంచరిలు చేసిన ఆటగాడిగా సచిన్ చరిత్ర సృష్టించాడు.

బంగ్లాదేశ్ మీద 100 వ సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

మీడియా గుర్తింపులు


2003 ఆగస్ట్లో జీన్యూస్ ద్వారా దేశంలో గొప్ప క్రీడావ్యక్తిగా ఎన్నికైనాడు.
2006 నవంబర్లో టైంమేగజైన్‌చే ఏషియన్ హీరోలలో ఒకడిగా గుర్తింపు పొందినాడు.
2006 డిసెంబర్లో స్పోర్ట్స్ పర్సన్ ఆప్ ది ఇయర్‌గా పేరుసంపాదించాడు.
2010 అక్టోబర్ లండన్లో జరిగిన ద ఆసియన్ అవార్డ్స్ వేడుకల్లో ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్, పీపుల్స్ ఛాయస్ అవార్డులు గ్రహించాడు.

సచిన్ సాధించిన రికార్డులు

వన్డే రికార్డులు
వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (49 సెంచరీలు)
వన్డే క్రికెట్ లో అత్యధిక అర్థ సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (96 అర్థ సెంచరీలు)
అత్యధిక వన్డే పోటీలకు ఆడిన క్రికెటర్. (463 వన్డేలు)
వన్డే క్రికెట్ లో అత్యధిక పర్యాయాలు మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డు పొందిన క్రికెటర్. (62 సార్లు)
వన్డే క్రికెట్ లో అత్యధిక పర్యాయాలు మ్యాన్ ఆప్ ది సీరీస్ అవార్డు పొందిన క్రికెటర్. (15 సార్లు)
అతిపిన్న వయస్సులో (16) వన్డే క్రికెట్ ఆడిన భారతీయుడు.
అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్. (18426 పరుగులు)
10000, 11000, 12000, 13000, 14000, 15000, 16000 17000, 18000 పరుగులు పూర్తిచేసిన తొలి ఆటగాడు.
ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 1000 పరుగులు చొప్పున 7 సార్లు సాధించాడు.
ఆస్ట్రేలియా, దక్షిణ ఆఫ్రికా, న్యూజీలాండ్, శ్రీలంక, జింబాబ్వేలపై అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్.
ఒకే క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు. (1894 పరుగులు)
ఒకే క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక సెంచరీలు. (9 సెంచరీలు)
రాహుల్ ద్రవిడ్తో కలిసి అత్యధిక పరుగుల పాట్నర్‌షిప్ రికార్డు. (331 పరుగులు )
సౌరవ్ గంగూలీతో కలిసి అత్యధిక ఓపెనింగ్ పాట్నర్‌షిప్ రికార్డు. (6609)
అత్యధిక సార్లు 200 మించి పాట్నర్‌షిప్ పరుగులు. (6 సార్లు)
వన్డేలలో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడు.
2011 వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టు సభ్యుడు.

టెస్ట్ రికార్డులు
పిన్న వయస్సులో టెస్ట్ క్రికెట్ ఆడిన భారతీయుడు.
టెస్ట్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (51 సెంచరీలు)
టెస్ట్ క్రికెట్‌లోఅత్యధిక అర్థసెంచరీలు సాధించిన భారతీయ బ్యాట్స్ మెన్. (67అర్థ సెంచరీలు)
20 సంవత్సరాల వయస్సులోనే 5 టెస్ట్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్.
కెప్టెన్‌గా ఇన్నింగ్సులో అత్యధిక పరుగులు చేసిన భారతీయుడు. (217 పరుగులు)
అన్ని టెస్టు ఆడే దేశాలపై సెంచరీలు సాధించిన తొలి భారతీయుడు.
అత్యధిక టెస్టులు ఆడిన భారతీయ క్రికెటర్. (200 టెస్టులు)
టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్. (15837)
అతివేగంగా 10 వేల పరుగులు పూర్తి చేసిన భారతీయ బ్యాట్స్‌మెన్. (195 ఇన్నింగ్సులలో)
12000, 13000, 14000, 15000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మెన్.
విదేశాలలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్.
ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 1000 పరుగులు చొప్పున 5 సార్లు సాధించిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌.

ప్రపంచ కప్ రికార్డులు


ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్. (2000+ పరుగులు)
2003 ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్. (673 పరుగులు)
1996 ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్. (523 పరుగులు)

అవార్డులు


1994లో అర్జున అవార్డు.
1999లో పద్మశ్రీ పురస్కారం.
1997లో రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పురస్కారం.
1997లో విస్డెన్ క్రికెటర్ అఫ్ ది ఇయర్ పురస్కారం.
2008లో పద్మ విభూషణ్ పురస్కారం.
2010లో ఐసిసి క్రికెటర్ అఫ్ ది ఇయర్ అవార్డు .
2014కు గాను భారతప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను ఈయనకు 16-నవంబర్-2013 నాడు ఈయన క్రీడావిరమణ సందర్భంగా ప్రకటించింది.
2020లో లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు

This article given by :మహానుభావులు-mahanubhavulu

omkrish