Sulkhan Singh – One in a hundred crore…!

పోలీసులంటే తెలియని వాళ్లు ఉండరు. కానీ మనకిప్పటి వరకు తెలిసిన పోలీసులు వేరు.. ఈయన వేరు. ‘నూటికో కోటికో ఒక్కడు’ అనే సామెత విన్నారు కదా.. ఈయన అలాంటి ఒక్కడే అనుకోవచ్చు.ఈయన్ని చూసే వరకు నిజంగా పోలీసు డిపార్ట్మెంట్ లో ఇలాంటి వాళ్లు ఉంటారంటే నమ్మబుద్ధి కాదు. కానీ నిలువెత్తు నిజాయితీ మన కళ్లెదురుగా కనిపిస్తోంటే నమ్మక తప్పదు. ఆయన ఎవరో కాదు.. యూపీ డీజీపీగా 2017లో ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏరి కోరి తీసుకొచ్చిన.. సుల్ఖాన్ సింగ్ 1957లో జన్మించిన సుల్ఖాన్ సింగ్.. ఉత్తరప్రదేశ్ లోని తిండ్వారీ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత స్థానిక భజరంగ్ కళాశాలలో ఇంటర్, రూర్కీలో ఇంజినీరింగ్, ఢిల్లీలో ఎంటెక్ చేశారు.చదువు పూర్తయ్యాక రైల్వేస్‌లో ఇంజినీర్‌గా పనిచేశారు. 1980లో సివిల్ సర్వీసెస్ లో మంచి ర్యాంక్ సాధించిన ఈయన ఐపీఎస్ అధికారి అయ్యారు. సుల్ఖన్ సింగ్ కి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.ఐపీఎస్ అధికారిగా పోలీసు శాఖలో పలు హోదాల్లో సింగ్ పనిచేశారు. అలహాబాద్ లోని పోలీసు హెడ్ క్వార్టర్స్ లో, శిక్షణ మరియు జైళ్ల శాఖలో పనిచేశారు. లక్నో రేంజ్ డిఐజీగా, ఆ తరువాత లక్కో జోన్ ఐజీగా పని చేశారు. విధి నిర్వహణలో భాగంగా, ప్రతి హోదాలో నేరాల అదుపునకు విశేష కృషి చేసిన రికార్డు ఈయనకు ఉంది.నిరాడంబరానికి చిరునామా…దేశంలోనే అతిపెద్ద పోలీసు పటాలానికి అధినేత అయిన డీజీపీ సుల్ఖాన్ సింగ్ ఇల్లు చూస్తే నోట్లోంచి మాట రాదు. ఓ సాధారణ కానిస్టేబుల్ కూడా అలాంటి ఇంట్లో నివసించడేమో.. అన్నట్లుగా ఉంటుంది ఆ ఇల్లు. ఆ ఇంటిని చూసి చెప్పొచ్చు.. సుల్ఖాన్ సింగ్ ఎంతటి నిరాడంబరుడో.డీజీపీ కాకముందు కూడా సుల్ఖాన్ సింగ్ పోలీసు శాఖలో పలు విభాగాల్లో పనిచేశారు. ఇక ఆయన ఆస్తిపాస్తులు చూస్తే అవాక్కవుతారు. ఈయన పేరిట ఉన్న ఇల్లు చూశారుగా, అదికాక 2.3 ఎకరాల పొలం మాత్రమే ఈయనకుంది.ఉత్తరప్రదేశ్ పోలీసు శాఖలో నిజాయితీ పరుడైన, సమర్థుడైన అధికారిగా పేరు సంపాదించుకున్నప్పటికీ ఈయన రాజకీయ నాయకుల అండదండలు మాత్రం సంపాదించుకోలేకపోయారు. అందుకేనేమో ఈయనకంటే నాలుగేళ్ల జూనియర్ అయిన జావెద్ అహ్మద్ డీజీపీ అయినా ఈయన మాత్రం అలాగే ఉండిపోయారు.యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తరువాత సుల్ఖాన్ సింగ్ ఆయన దృష్టిలో పడ్డారు. తన టీంలో ఎవరికి చోటు కల్పించాలో యోగికి బాగా తెలుసు. అందుకే పదవీ విరమణకు మరో అయిదు నెలలు మిగిలి ఉన్న తరుణంలో నిలువెత్తు నిజాయితీకి పట్టం కట్టబడింది. రాత్రికి రాత్రే సుల్ఖాన్ సింగ్ ఉత్తర ప్రదేశ్ డీజీపీగా వచ్చేశారు.డీజీపీగా నియమితులైనప్పటికీ వ్యక్తిగా సుల్ఖాన్ సింగ్ లో ఏలాంటి మార్పు రాలేదు. సీదాసాదాగా ఉండడమే ఆయనకు ఇష్టం. ఇప్పుడూ అదే పంథా కొనసాగిస్తున్నారు. అందుకే ఉన్నత పదవిలో ఉన్నా.. తాను పుట్టి పెరిగిన ఆ పెంకుటిల్లులోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.